హైదరాబాద్, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) : మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే స్ట్రీట్ వెండర్స్ ఎగ్స్ షాప్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని పేద, సామాన్య ప్రజలకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించేందుకు ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో క్యాంటీన్లను అభివృద్ధి చేస్తోందన్నారు. మహిళా సంఘాలకు గతంలో ఉన్న రూ.5 లక్షల వడ్డీలేని రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, గత మూడేళ్లుగా రుణాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. క్యాంటీన్లతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, బస్సులు, ఇతర ఉపాధి అవకాశాలను మహిళా సంఘాలకు కల్పిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 600 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు అందించామని, పట్టణ ప్రాంతాల్లోనూ ఈ అవకాశాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీసీ, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణ అందించే కార్యక్రమం చేపట్టామని, అర్హులైన మహిళలు సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. మహిళలు కుటుంబానికే పరిమితం కాకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని, మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబ, సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన :
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి సూర్యనగర్ బస్తీలో కోటి 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఎస్‌డబ్ల్యూడీ డ్రెయిన్, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్, జోనల్ కమిషనర్ మంగతాయారు, ఎస్‌సి ఆశలత, ఈఈ స్వర్ణ, డిఈ గీతకుమారి, ఏఈ శ్రీనివాస్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్పనా యాదవ్, వాజిద్, మారిశెట్టి నర్సింగ్‌రావు, పలు డివిజన్ల అధ్యక్షులు నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






