ఆదిలాబాద్, ( అద్దం న్యూస్ ) : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ వేదికగా జరిగిన ‘రైతు గర్జనస సభ ఆదివారం జరిగింది. ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన మూడు విడతల రైతుబంధు బకాయిలతో పాటు, ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి వెంటనే రూ.60,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలని, రైతు కూలీలకు ఇచ్చిన ఆర్థిక సాయం హామీని సైతం అమలు చేయాలన్నారు. తెలంగాణ కంటే రెండింతల వర్షపాతం లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేవు. పుష్కలంగా నీటి వనరులున్నా.. కేవలం కాంగ్రెస్ అసమర్థత వల్లే తెలంగాణ రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారన్నారు. గోదావరి నుంచి 750 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎత్తిపోయడం లేదన్నారు. కరెంట్ లేదు, సాగునీరు లేదు, పరిశ్రమలకు ప్రోత్సాహం లేదని.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు సంక్షోభంలో పడ్డాయన్నారు. ఆదిలాబాద్‌లో ఇవాళ అసమర్థ కాంగ్రెస్ పై అన్నదాతలు మోగించిన జంగ్ సైరన్ తో నీ ముఖ్యమంత్రి పీఠానికి, మీ చేతకాని ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని హెచ్చరించారు.
రైతు బంధు బంద్.. రాహుల్ బంధు మాత్రం ఫుల్ :
రైతులకు ఇచ్చేందుకు ఖజానాలో నిధులు లేవంటున్న ప్రభుత్వం.. ఢిల్లీకి మాత్రం క్రమం తప్పకుండా డబ్బుల మూటలు పంపుతోందన్నారు. రుణమాఫీ, రైతుబంధు పెంపు, తులం బంగారం హామీలన్నీ గాల్లో కలిసిపోయాయన్నారు.
బీజేపీ – కాంగ్రెస్ తోడు దొంగలు :
ఇక్కడ కొట్లాడుతున్నట్లు నటిస్తూ ఢిల్లీలో చేతులు కలిపే ‘ బడేభాయ్ – చోటేభాయ్ ‘ రాజకీయాలతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఆదిలాబాద్ సీసీఐని నిర్వీర్యం చేసి, పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలచివేస్తోందన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దు.. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం వస్తుంది, ప్రతి రైతన్నను గుండెల్లో పెట్టుకుని ఆదుకుంటామన్నారు.






