బషీర్‌బాగ్, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) : విద్యారంగంలో 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ( బీఎస్‌ఎంఏటీ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, విద్యావేత్తలు కోరారు. విద్యారంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు మద్దతు ప్రకటించారు. తెలంగాణలో సుమారు 8,500 ప్రైవేట్ పాఠశాలలతో అనుబంధంగా పనిచేస్తున్న బీఎస్‌ఎంఏటీ తరఫున విద్యారంగ అభివృద్ధి, పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరంపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గుజ్జ సత్యం రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో పనిచేస్తూ వివిధ సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారని ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యారంగ అనుభవం ఉన్నవారికి శాసనమండలిలో అవకాశం కల్పిస్తే పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను విధాన నిర్ణేతల దృష్టికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బిఎస్ఎంఎటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యారంగంలో రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న గుజ్జ సత్యం సేవలను గుర్తించాలని, విద్యారంగ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తికి శాసనమండలిలో అవకాశం కల్పించడం సముచితమన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. నాణ్యమైన విద్య అందరికీ చేరాలంటే విద్యారంగ సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
కోశాధికారి జె.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… విద్యాసంస్థల అభివృద్ధికి ఆర్థిక, పరిపాలనా అంశాలపై అవగాహన అవసరమన్నారు. క్షేత్రస్థాయి అనుభవం ఉన్నవారి సూచనలు విధాన రూపకల్పనలో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… విద్యారంగ అభివృద్ధికి క్షేత్రస్థాయి అనుభవం ఉన్నవారి సూచనలు అవసరమన్నారు. పాఠశాలల సమస్యలను ఉన్నతస్థాయిలో ప్రస్తావించేందుకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్నారు.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ… జిల్లా స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, పాఠశాలల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సమర్థమైన ప్రాతినిధ్యం అవసరమని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోశాధికారి మునీందర్‌రావు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సంఘాలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలను విధాన నిర్ణేతల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భరత్ కుమార్ మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలలు విద్యావ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగ అనుభవం ఉన్న గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగ సేవలకు గుర్తింపు లభించడం మరింత మంది సామాజిక బాధ్యతతో పనిచేసేందుకు ప్రోత్సాహాన్నిస్తుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న గుజ్జ సత్యం సేవలను పరిగణనలోకి తీసుకోవాలని, ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఎంఏటీ ( BSMAT ) రంగారెడ్డి జిల్లా కోశాధికారి మునీందర్‌రావు, జిల్లా కార్యదర్శి జిల్లా వెంకటేష్, జగన్మోహన్ రెడ్డి, గంజి అరవింద్ బాబు, రాజు, తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు, విద్యావేత్తలు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






