ముల్లకత్వ చెరువు ఎస్టీపీ, గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ
# శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశం
# ఎయిర్ టెక్ మిషన్లలో తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచన
హైదరాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :
జలమండలి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ( జేఎండీ ) మయాంక్ మిట్టల్ మంగళవారం ముల్లకత్వ చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ( ఎస్‌టిపి ) సందర్శించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌టిపిలో ఏర్పాటు చేసిన గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. శుద్ధి చేసిన నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్‌ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దశలో నీటి నాణ్యతను నిర్ధారించుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జలమండలి పరిధిలో వినియోగిస్తున్న ఎయిర్ టెక్ మిషన్లలో తాగునీటికి బదులుగా ఎస్‌టిపిల్లో శుద్ధి చేసిన నీటిని ఉపయోగించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా నిర్మాణ పనులు, ఉద్యానవనాల నిర్వహణ, రోడ్ల శుభ్రత తదితర తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా విలువైన తాగునీటిని ఆదా చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ ఈడి సంతోష్, ఎస్‌టిపి సీజియం పద్మజాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.








