నియోజకవర్గాల పునర్ విభజనను మరో 25 ఏళ్ల పాటు నిలిపివేయాలి
జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
ఒక వేళ కేంద్రం ఇప్పుడే చేపడితే జనాభా ప్రాతిపదికన కాకుండా
రాష్ట్రం యూనిట్ ప్రస్తుతం ఉన్న ఎంపి స్థానాలలో 2:1 నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాలను పెంచాలి
– తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశం డిమాండ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : “జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ ( లోక్‌సభ ) నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, నియోజకవర్గాల పునర్ విభజనను మరో 25 ఏళ్ల పాటు నిలిపివేయాలని తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్ అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. ఒక వేళ కేంద్రం ఇప్పుడే చేపడితే జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రం యూనిట్ ప్రస్తుతం ఉన్న ఎంపి స్థానాలలో 2:1 నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ‘తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’ అఖిలపక్ష సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో చర్చించిన అనంతరమే నియోజకవర్గాల పునర్ విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశం కోరింది. నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, జనాభా నియంత్రణను విజయవంతం చేసి దేశాభివృద్ధికి తొడ్పడుతున్న రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదని అఖిలపక్ష సమావేశం హెచ్చరించింది. జనాభా ప్రాతిపదికన లోక్ నియోజకవర్గాలను విభజించి ఉత్తరాదిలో సీట్లను పెంచుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలనే బిజెపి కుట్రను బయటపెట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు, మేధావులు, అన్నివర్గాల వారు ఐక్యంగా పోరాడాలని సమావేశం పిలుపునిచ్చింది. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనపై ‘తెలంగాణ పీపుల్స్ వాయిస్ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సి కె.యాదవ్ రెడ్డి ఎంపి నియోజకవర్గాల పునర్ విభజనపై వివరాలతో ఒక ముసాయిదా నివేదికను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్ విభజనలో కేవంలం జనాభానే కాకుండా జిడిపి, మానవ వనరుల అభివృద్ధి సూచిక, అక్షరాస్యత తదితర అంశాలలో దేశాభివృద్ధికి రాష్ట్రాలు చేస్తున్న కృషిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దేశ జిడిపిలో 36 శాతం వాటా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు 36 శాతం లోక్ సీట్లను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జి.వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన లోక్ నియోజకవర్గాల పునర్ విభజన చేయడం ద్వారా దక్షిణాదికి సీట్లు తగ్గించి ఉత్తరాదికి సీట్లు పెంచుకోవడం ద్వారా బిజెపి తన రహస్య ఏజెండాను అమలు చేసుకునే కుట్ర దాగి ఉందన్నారు. జిడిపి, జిఎస్ ఐటి తదితర అన్ని రకాలుగా దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే బిజెపి చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఇందు కోసం పోరాడుతున్న దక్షిణాది రాష్ట్రాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు అండగా నిలవాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ… బిజెపి తన రాజకీయ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల లోక్ సీట్లను తగ్గించాలని అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన లోక్ సీట్లను విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 27.4 శాతం నుంచి 19.1 శాతానికి తగ్గిపోతాయని, అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల సీట్లు 40 శాతం నుంచి 46 శాతానికి పెరుగుతాయని, తద్వారా దేశంపై పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనలో రాష్ట్రాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోకి తీసుకుని దేశాన్ని సమతుల్యంతో ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యావేత్త మధుసూదన్ మాట్లాడుతూ … లోక్ సీట్ల ఆధారంగానే రాజకీయ పార్టీలు మంత్రి పదవులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాపాడుతూనే నియోజకవర్గాలను పెంచాలని, అప్పుడే ఎంపి, ఎంఎల్ ఎంఎల్ సీట్ల సంఖ్య పెరిగి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.
డాక్టర్ దిడ్డి సుధాకర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవరిస్తూ ఫెడరల్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్ విభజనపై యాదవ్ ఇచ్చిన నివేదికకు అదనంగా అఖిలపక్ష సమావేశంలో వచ్చిన సూచనలతో కలిపి ఒక పుస్తకాన్ని ప్రచురిస్తామని, గ్రామస్థాయి వరకు సమావేశాలను ఏర్పాటు చేసి ఈ విషయంపై ప్రజలను చైతన్యవంతం చేస్తామన్నారు. నియోజకవర్గాల పునర్ విభజనపై చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల సమావేశాన్ని దొంగల ముఠా సమావేశమని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసింది. తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు తిన్నింటి వాసాలు లెక్కించే విధంగా, కన్నతల్లికి ద్రోహం చేసే విధంగా ఉన్నాయని సమావేశం గర్హించిందన్నారు. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖమైన ఎపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడమే లక్షంగా ఎన్ స్థాపించిన టిపిడికి నాయకత్వం వహిస్తున్న ఎపి సిఎం చంద్రబాబునాయుడు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్ విభజనకు వ్యతిరేకంగా జరిగే పోరాటంతో కలిసి రావాలని సమావేశం కోరుతూ మరోక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఎం.జగన్ (ఐప్సో), నారాయణ (బ్లాసమ్ విద్యా సంస్థల అధినేత), తిప్పర్తి యాదయ్య, ఉపేందర్, పార్వతి (తెలంగాణ విద్యావంతుల వేదిక), మల్లంగి విజయ్, జావెద్ షరీఫ్, డాక్టర్ లక్ష, మౌనిక, దర్శనం రమేష్, ధర్మేందర్ తివారి, ఖాన్, కోడంగల్ శ్రీనివాస్, అజీమ్, పవార్, షబాజ్, సత్యనారాయణ రెడ్డి (ఆప్), ఎం.వేణు (టిజెఎస్), సంఘ సేవకులు రాకేష్ తదితరులు ప్రసంగించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply