రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది – సీఎం రేవంత్ రెడ్డి 

రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుంది 

     – సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 2, అద్దం న్యూస్ :   భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు’ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్ ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం – 2025 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని పేర్కొన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి’ అని తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేసిన గొప్ప నాయకుడన్నారు. దేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారని.. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు మొట్ట మొదటి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణ రెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారని గుర్తు చేశారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అందరితో చర్చించి, వారి గౌరవాన్ని పెంచేందుకు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకుని సముచితమైన స్థానం కల్పిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తొలితరంలో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే, మలితరంలో ఎస్.జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి వారు తెలంగాణ సమాజానికి స్ఫూర్తినిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి గారు, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి గారితో పాటు ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page