హైదరాబాద్, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) : టీజీపీఎస్సీ నిర్వహించనున్న ఏఈఈ ( ఆర్ అండ్ బీ ) పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. నవంబర్ 6, 7 తేదీల్లో ఏఈఈ పరీక్షలు జరగనుండగా, నవంబర్ 6న ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ పరీక్ష కూడా ఉందని తెలిపారు. ఒకే తేదీన పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నవంబర్ నెలలో 6, 7 తేదీల్లో టిజిపిఎస్‌సి ఏఈఈ ( సివిల్ ) సిబిటి పరీక్షలున్నాయని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జూనియర్ ఇంజినీరింగ్ ( ఎస్ఎస్‌సి ) పరీక్షలు నవంబర్ 2వ నుంచి 6వ తేదీ వరకు జరుగనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి పరీక్షకు సిద్దమవుతున్న ( ఏఈఈ అర్ అండ్ బి ) అభ్యర్థులకు మరొక పరీక్షను వదులుకోవాల్సి వస్తుందన్నారు. దీని వల్ల అభ్యర్థులు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారన్నారు.
ఈ విషయం గురించి పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజ్యాంగబద్ద సంస్థ అయిన టిజిపిఎస్‌సిలో ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని… అధికారులతో చర్చించి జవాబు ఇస్తామని చెప్పారు.. కానీ గడిచిన 20 రోజులైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. రాష్ట్రంలో విడుదలైన సిపిబి ( పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ) పరీక్షకు, అలాగే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి క్లాష్ అవడం వల్ల ఈ నెల 26వ తేదీన జరుగనున్న పరీక్షల్లో చాలా మంది అభ్యర్థులు ఏదో ఒక పరీక్ష రాసే అవకాశం కోల్పోతారన్నారు. ఇదే మాదిరిగానే ఎస్ఎస్‌సి జేఈ, అర్ అండ్ బి ఏఈఈ కూడా అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోతారన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నష్టం కలగకుండా ప్రభుత్వం స్పందించి, ఏఈఈ పరీక్షను వారం రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశ్, బీసీ సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్, యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీ రాందేవ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్ నాయక్, అల్లం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






