...

పోలీసు, ప్రాసిక్యూషన్‌ బృందాన్ని సన్మానించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ 

సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్‌ బృందాన్ని సన్మానించిన నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ 

హైదరాబాద్,  మే  15, అద్దం న్యూస్ :   సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్‌, దారుణ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, ప్రాసిక్యూషన్ నిర్వహించిన బృందాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ.సజ్జనర్ గురువారం ప్రత్యేకంగా అభినందించి, సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జివి.రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎం.ముత్తు యాదవ్, సనత్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ డి.అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎన్.శేఖర్‌లకు ఈ గౌరవం దక్కింది.

అత్యంత పాశవికంగా బాలుడిని హత్య చేసిన ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా III అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కమ్ ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వరరావు ఇటీవల చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన రెండో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజా (A1) 2023 ఏప్రిల్‌ 20న అబ్దుల్ వాహిద్ ఖాన్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. బాలుడిని గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు. బాలుడి తండ్రి వసీం ఖాన్ కు నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడం లేదనే కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడు తన నివాసంలోనే ఆ బాలుడిని గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మొహమ్మద్ రఫీక్ సాయంతో మృతదేహాన్ని ఒక బకెట్ లో కుక్కి, సమీపంలోని నాలాలో పడేశారు. మృతదేహాన్ని దాచిపెట్టి, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడంలో ప్రధాన నిందితుడికి మహమ్మద్ రఫీక్ సహకరించాడు. తన కుమారుడు కనిపించడంలేదంటూ.. బాలుడి తండ్రి సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సిసిటివి ఫుటేజీని పరిశీలించగా.. నిందితుల కదలికలు స్పష్టంగా కనిపించాయి.

ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజాకు ఉరి శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. అలాగే కిడ్నాప్ కింద యావజ్జీవ శిక్ష, సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో మరో 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రెండో నిందితుడైన మహమ్మద్ రఫీక్‌కు సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా వీసీ.సజ్జనర్ మాట్లాడుతూ… సమాజం తలదించుకునేలా బాలుడిని దారుణ హత్య చేసిన నిందితులకు ఈ తీర్పు ఒక గుణపాఠం అని అన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే లక్ష్యంగా ఇటీవల మేము ఏర్పాటు చేసిన ‘ ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ‘ ఈ కేసులో కీలక పాత్ర పోషించిందన్నారు. డీసీపీ క్రైమ్స్ ఎస్.చైతన్యకుమార్, ఓఎస్డీ మల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక కేసుల దర్యాప్తు పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పని చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేశారని ఆయన కొనియాడారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.