హైదరాబాద్, నవంబర్ 13, ( అద్దం న్యూస్ ) : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని భక్తిటీవీ ఈ ఏడాది సైతం కోటి దీపోత్సవ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియం వేదికగా నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కోటిదీపోత్సవం జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. ప్రతిరోజూ భక్తులే స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే విధంగా కార్యక్రమం జరగనుంది. ప్రసిద్ధ క్షేత్రాల ఉత్సవమూర్తుల కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. 17 రోజుల కార్యక్రమంలో భాగంగా మహాశంఖాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మాభిషేకం, సోమనాథ్ జ్యోతిర్లింగ పూజ, కొల్హాపూర్ మహాలక్ష్మి – కంచి కామాక్షి – మధురై మీనాక్షి అమ్మవార్ల దర్శనం, కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతిరోజూ కార్యక్రమంలో భాగంగా స్వర్ణలింగోద్భవం, మహానీరాజనం, సప్తహారతులు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. ఇందుకుగానూ ఎలాంటి రుసుములు ఉండవని.. ఎవరైనా రావచ్చని.. దేవతామూర్తులు, దీపారాధన నిమిత్తం వత్తులు, నూనె, ప్రమిదలు వంటి పూజాద్రవ్యాలన్నింటిని ఉచితంగా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
నేటి నుంచి ఎన్‌టిఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం
RELATED ARTICLES








