హైదరాబాద్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : ” అహింసా పరమో ధర్మం ” అనే పవిత్ర సూక్తిని విశ్వసించి, సత్యాగ్రహాన్నే శక్తివంతమైన ఆయుధంగా మలుచుకుని భరతమాత స్వేచ్ఛ కోసం సాగిన స్వాతంత్య్ర సమరంలో యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ నల్లెల్ల కిషోర్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ నగర టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లెల్ల కిషోర్ హాజరై గాంధీ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాత్ముని ఆశయాలకు, ఆదర్శాలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంకితమై పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గాంధీజీ చూపిన బాటలోనే సమాజానికి అహింసా విధానంతో, ప్రజాస్వామ్య విలువలతో, సేవా నిరతితో తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ఆనాడు సూర్యుడు అస్తమించని అజేయమైన బ్రిటీష్ సామ్రాజ్యపు అహంకారాన్ని, అణచివేత పాలనను అహింస, సత్యం అనే నిరాయుధ పోరాటంతో ఎదిరించి తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి ప్రసాదించిన యుగ పురుషుడు గాంధీజీ అని కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత విప్లవానికి అహింసా మార్గాన్ని ఆయుధంగా చూపారని గుర్తుచేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో, సమసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎంకె.బోసు, పరుశురామ్, శ్యామ్ సుందర్, తడక వినోద్, కరణం కరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్, సాయి కిరణ్, మచ్చేంధర్, సత్తన్న, ఆనంద్ లతో పాటు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






