...

Mohit Sharma: టీమిండియా పేసర్ కీలక నిర్ణయం.. అన్ని ఫార్మాట్స్‌కు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ (Mohit Sharma) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్స్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా 37 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

‘ఈ రోజు నేను అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నాను. హర్యానాకు ప్రాతినిథ్యం వహించడం నుంచి భారత్ జెర్సీ ధరించి ఐపీఎల్ ఆడేవరకు సాగిన నా ప్రయాణం నాకు దక్కిన వరం.’అని మోహిత్ శర్మ పేర్కొన్నాడు. మోహిత్ శర్మ (Mohit Sharma) రిటైర్మెంట్‌పై తన చివరి ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. ‘మీ బ్యాక్-ఆఫ్-ది-హ్యాండ్ స్లోయర్ బంతులతో డెత్ ఓవర్లలో బౌలింగ్‌ను విప్లవాత్మకం చేశారు. గొప్ప కెరీర్‌కు అభినందనలు, మోహిత్ భాయ్’ అని ప్రశంసించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో మోహిత్ శర్మ (Mohit Sharma) సుదీర్ఘ కాలం ఆడకపోయినప్పటికీ బౌలర్‌గా తనదైన ముద్ర వేసుకున్నాడు. హర్యానాతో దేశవాళీ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన మోహిత్ శర్మ (Mohit Sharma).. భారత్‌కు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఐపీఎల్‌ 2013లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంతోనే అతనికి గుర్తింపు లభించింది. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

భారత్ తరఫున 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో మోహిత్ శర్మ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరఫున 26 వన్డేలు ఆడి 31 వికెట్లు, 6 టీ20ల్లో 6 వికెట్లు తీసాడు. 2015లోనే మోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఆ తర్వాత అతనికి అవకాశాలు రాలేదు. చివరిసారిగా అతను సౌతాఫ్రికాతో 2015లో వన్డే మ్యాచ్ ఆడాడు.

ఐపీఎల్‌లో మోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ (2013-2015, 2019), పంజాబ్ కింగ్స్ (2016-2018), ఢిల్లీ క్యాపిటల్స్ (2020), గుజరాత్ టైటాన్స్ (2023-2024) తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 120 మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 134 వికెట్లు పడగొట్టాడు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.